Tuesday, 14 August 2012

140812, TUESDAY

·  జగన్ అక్రమాస్తుల కేసులో వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ ధర్మాన పేరును ఛార్జిషీట్ లో చేర్చడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు.
·  ప్రకాశం జిల్లా కందుకూరు వంద పడకల ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో చీకట్లో చిన్నారులు, రోగులు చీకట్లోనే గడపాల్సి వచ్చింది.
·  ఆర్థిక నేరాల కోర్టు పూర్తి తీర్పును నిలిపివేయాలంటూ మంత్రి పార్థసారధి చేసుకున్న అభ్యర్థనను నాంపల్లి సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్థిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షలా 25 వేల జరిమానా విధించింది. ఐతే నాంపల్లి సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేసిన పార్థసారధి జైలు శిక్ష నిలిపివేయాలని ఒక పిటీషన్, పూర్తి తీర్పును నిలిపివేయాలంటూ మరో పిటీషన్ దాఖలు చేశారు. జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ గతంలోనే సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే పూర్తి తీర్పును నిలిపివేసేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.
·  ప్రభుత్వంతో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. 35 వేల రూపాయల ఫీజు ఒప్పందానికి కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయి. చర్చల్లో ప్రభుత్వ సానుకూలత వల్ల కోర్టుకు వెళ్లడం లేదని, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఐతే కళాశాలల నియంత్రణకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రెండేళ్లు నిలుపుదల చేసే షరతుపై రాజీపడినట్లు వారు తెలిపారు. అదేవిధంగా కళాశాలల పర్యవేక్షణకు ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ లో పోలీస్ అధికారులను తొలగించేందుకు కూడా సీఎం అంగీకరించినట్లు వారు తెలిపారు.
·  వైజాగ్ పెందుర్తిలో ఒక ప్రైవేటు కళాశాల విద్యార్థులు 450 అడుగుల జాతీయ జెండాను తయారు చేశారు. దీని తయారీకి రెండు వారాల పాటు వారు కష్టపడ్డారు.
·  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య రక్షణ పథకానికి మోక్షం లభించింది. గతంలోనే దీనికి ఆమోదం లభించినా ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్య రక్షణ నిధి పేరిట 184 జీఓ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నవంబర్ 1నుంచి అమలులోకి రానుంది.
·  భారత్, పాక్ ల మధ్య వైషమ్యాలను పక్కనపెట్టి సమైక్య భావనను పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థల సంయుక్త వేదిక (కోవా) ఆధ్వర్యంలో నాంపల్లిలో ఇరుదేశాల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఇరు దేశాల విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు.
·  గాలి బెయిల్ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటీషన్ పై విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదిగా హోం శాఖ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ఏసీబీ జేడీ సంపత్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
·  లండన్ ఒలింపిక్స్ లో పతకం గెలుచుకున్న హైదాబాదీ షూటర్ గగన్ నారంగ్ సాంస్కృతిక, క్రీడా శాఖా మంత్రి వట్టి వసంత కుమార్ ని కలిశారు.
·  హైదరాబాద్ అంబర్ పేటలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ పై వాహనదారులు దాడి చేశారు. శివం రోడ్డు దగ్గర నాగమోహన్ రెడ్డి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపి గతంలో ఓ చలాన్ కు సంబంధించి 270 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉందని, అది వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. వీరి గొడవ కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఆగ్రహించిన వాహనదారులు కానిస్టేబుల్ పై దాడి చేసి చితకబాదారు.
·  అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం సమీపాన ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులను వేపులపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు.. 
·  హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30 వేలా 250 రూపాయలుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29వేలా 600గా ఉంది.
·  విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మత్స్యకారుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. దీంతో రంగంలోకి దిగిన విశాఖ సౌత్ ఏసీపీ దాసరి రవిబాబు టీడీపికి చెందిన మత్స్యకార నాయకుడు ముత్యాలు, అర్జల మసేన్ తో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అలజడి జరుగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
·  ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
·  గుంటూరు జిల్లా గురజాల ఎంఎల్ ఏ యరపతినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పిడుగురాళ్ల సీఐ బి.శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా రెండు రోజుల క్రితం స్టేషన్ ముందు తన అనుచరులతో ఎంఎల్ఏ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐని విమర్శించడం, కులం పేరుతో దోషించడం చేశాడంటూ పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎంఎల్ఏతో పాటు మరో 27 మందిపైనా కేసు ఫైల్ చేశారు పోలీసులు..
·  గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 808.80 అడుగులుగా ఉంది. జలాశయం ఇన్ ఫ్లో 72వేలా 890 క్యూసెక్కులు.
·  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శ్రీపర్రు సమీపంలోని మానేపల్లి కాజ్ వేలో కారుబోల్తా పడింది. ఏలూరు నుంచి భుజబలపట్నం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కృష్ణా జిల్లా కల్యాణ కృష్ణవర్మ కుటంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
·  సెప్టెంబర్ 18న బ్రహ్మోత్సవాల నాటికి తిరుమలలో నీటి కొరత తీరుస్తామని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. పైపులైను నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులు పొందుతామని ఆయన తెలిపారు. హర్యానాలో 5 ఎకరాల్లో 30 కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి రేపు శంకుస్థాపన చేయనున్నట్లు బాపిరాజు తెలిపారు.
·  ఎరువుల వాడకానికి సంబంధించి దేశంలోని 11 రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే సమాచారంతో భారత సాయిల్ సైన్స్ సంస్థ ఓ వెబ్ సైట్ ను రూపొందించింది. ఆ సైట్ లో ఏ కాలంలో, ఏ పంటకు ఎంత ఎరువు వేయాలన్న సమాచారాన్నితెలుసుకోవచ్చు. ఇది త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆయా జిల్లాల్లోని మట్టి లక్షణాలు, పంటలరకాలను ఆధారంగా చేసుకొని ఎరువుల మోతాదుని నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల రైతులకు పనికొచ్చే సమాచారాన్ని తొలుత అందుబాటులో ఉంచనున్న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
·  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాల్లకల్ లో కల్లు తాగిన 120 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగగానే వాంతులు కావడంతో పాటు బాధితుల కాళ్లూ, చేతులు వంకర్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వారిలో కొంతమందిని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొంత మందిని కొంపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటనపై స్పందించిన సీఎం వెంటనే వైద్య బృందాలను కాళ్లకల్ కు పంపించాలని ఆదేశించారు. అదే విధంగా కల్తీకల్లు విక్రయాలపై చర్య తీసుకోవాలని కూడా సూచించారు. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు విక్రయించిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.
·  దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సీనియర్ డివిజినల్ ఇంజినీర్ సుఖ్ దేవ్ మెహతో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. కర్ణాటక హుబ్లీకి చెందిన ప్రియాంక కన్ స్ట్రక్షన్స్ నుంచి లక్షా 20 వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను సీబీఐ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
·  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో ఒక రోజు ముందుగానే మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. 25 వేల జాతీయ పతాకాలతో ఐదువేల మంది విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీని స్వాతంత్ర సమరయోధుడు పావులూరి శివ రామకృష్ణయ్య ప్రారంభించారు.